CINEMA

గేమ్ చెంజర్ గా చెర్రీ

రామ్‌ చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా మూవీకి సంబంధించి ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చేసింది. మొన్నటి వరకు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాకు ‘గేమ్‌ చేంజర్‌’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే మొదట టైటిల్‌ను మాత్రమే విడుదల చేసింది చిత్ర యూనిట్‌. టైటిల్‌ను రివీల్‌ చేస్తూ ఓ చిన్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్‌ చేసింది.

 

దీంతో రామ్‌ చరణ్‌ లుక్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ కాస్త డీలా పడ్డారు. అయితే చిత్ర యూనిట్ మరికాసేపట్లోనే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేసింది. పవర్‌ ఫుల్‌ టైటిల్‌కు తగ్గట్లుగానే చెర్రీ లుక్‌ ఉండడంతో ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. బైక్‌పై స్టైలిష్‌ లుక్‌లో ఉన్న ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామ్‌ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్ర యూనిట్‌.

 

ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నారన్న వార్తలు కూడా సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.