CINEMA

చరణ్ మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. రీఎంట్రీ

పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌తో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. సెన్సేషనల్ కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సనతో చేస్తున్నాడు.

బుచ్చిబాబు సనతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసే సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే తెలిసింది. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. శంకర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది బడా యాక్టర్లు భాగం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లయను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఆమె ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని సమాచారం. పాత్రకు ప్రాధాన్యం ఉండడం వల్లే ఆమె ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

 

రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.