Health

భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ గా క్లాసిక్ మసాలా దోశ

సందర్భం ఏదైనా బయటి నుండి ఫుడ్ తెప్పించుకుంటున్నాం అంటే అందులో బిర్యానీ ఉండాల్సిందే. భారతీయులకు ఎంతో ఇష్టమైన బిర్యానీని ఈ ఏడాది తమ యాప్ ద్వారా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నట్లు ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ వెల్లడించింది. 2022 సంవత్సరానికి సంబంధించి తమ యాప్ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించిన కీలక వివరాలు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఐటమ్ గా బిర్యానీ టాప్ లో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. నిమిషానికి 137 బిర్యానీలు తమ యాప్ ద్వారా ఆర్డర్ చేయబడినట్లు స్విగ్గీ తెలిపింది. అయితే ఇది గతంలో కన్నా ఎక్కవ అని ఆ సంస్థ వివరించింది. గతేడాది నిమిషానికి 115 బిర్యానీల ఆర్డర్లు వస్తే ఈ ఏడాది అవి 2.27శాతం పెరిగి 137 బిర్యానీలు ఆర్డర్లుగా వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది.

పార్టీ అంటే బిర్యానీని గుర్తుచేసుకునే భారతీయులు తర్వాత ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ గా క్లాసిక్ మసాలా దోశ నిలిచినట్లు స్విగ్గీ తెలిపింది. బిర్యానీ తర్వాత ఎక్కువ మంది మసాలా దోశను తమ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకున్నట్లు వివరించింది. ఇక స్నాక్స్ గా సమోసా ఆర్డర్ల జాబితాలో టాప్ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. 2022లో తమ యాప్ లో సమోసా కోసం 40లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వివరించింది. ఇక రాత్రి 10గంటల తర్వాత ఎక్కువ మంది పాప్ కార్న్ కోసం ఆర్డర్ చేసుకోవడం తాము గమనించామని.. ఈ ఏడాది 20లక్షల పాప్ కార్న్ ఆర్డర్లను తాము పొందినట్లు స్విగ్గీ తెలిపింది. ఇక ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్న స్వీట్ గా గులాబ్ జామూన్ నిలిచినట్లు స్విగ్గీ పేర్కొంది.

తమ యాప్ ద్వారా గులాబ్ జామూన్ 27లక్షల ఆర్డర్లు, రస్ మలై ఆర్డర్లు 16లక్షలు, చాకో లావా కేక్ కోసం 10లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ యాప్ లో వరుసగా ఏడో సంవత్సరం కూడా బిర్యానీనే టాప్ ఆర్డర్ గా నిలిచింది. ఇక భారతీయులు ఇండియన్ వంటకాలతో పాటు ఇతర దేశాల వంటకాలను తమ యాప్ ద్వారా రుచి చూసినట్లు స్విగ్గీ పేర్కొంది. సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ స్పైసీ రామెన్, ఇటాలియన్ పాస్తా ఆర్డర్లను తాము అందుకున్నట్లు స్విగ్గీ వివరించింది. ఇక తమ డెలివరీ పార్ట్ నర్లు 53కోట్ల రూపాయలను టిప్ గా అందుకున్నట్లు స్విగ్గీ అధికారికంగా ప్రకటించింది.