త్రిపురలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బద్ధ శత్రువులగా ఉండే కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోయాయి. బీజేపీకి ఇదొక చిక్కు అయితే.. వీటి మధ్య ఈ దఫా ఎన్నికల్లో కొత్త పార్టీ పోటీచేస్తుండటం మరో సమస్య! అదే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రద్యుత్ బిక్రమ్ మానిక్య దేబ్ బర్మ స్థాపించిన టిప్రా మోతా పార్టీ. కొత్త పార్టీ ఎంట్రీతో.. రాష్ట్రంలోని ఆదివాసీ బృందాల హక్కుల రక్షణ కోసం టిప్రా మోతా పార్టీని స్థాపించారు దేబ్ బర్మ. వీరి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, దానికి టిప్రాల్యాండ్ అని పేరు పెట్టాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు దేబ్ బర్మ. తమ డిమాండ్ల పరిష్కారానికి లిఖితపూర్వక లేఖ అందించే పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. TIPRA Motha party : “నేతల మాటలపై నాకు నమ్మకం లేదు. టిప్రాల్యాండ్ ఏర్పాటుకు లిఖితపూర్వక లేఖ అందించిన పార్టీతో పొత్తు కుదుర్చుకుటాము. ఈ విషయంలో అసలు రాజీపడే అవకశం లేదు,” అని దేబ్ బర్మ స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో నివాసముండే ఈ ఆదీవాసీ బృందాలకు.. రాష్ట్రంలోని 60 సీట్లల్లో 20 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
వీరి మద్దతు తమ పార్టీ ఉంటుందని దేబ్ బర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో.. ఐపీఎఫ్టీ (ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) అనే పార్టీతోనూ దేబ్ బర్మ టచ్లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో 9 సీట్లల్లో పోటీ చేసిన ఈ పార్టీ.. 8 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉంది. ఈ పార్టీని తమలో కలుపుకోవాలని దేబ్ బర్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత మూడు నెలల వ్యవధిలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఐపీఎఫ్టీ నుంచి టిప్రా మోతా పార్టీకి వలస వెళ్లిపోయారు. అనేక మంది కార్యకర్తలు సైతం.. పార్టీ జెండాను మార్చేశారు. మెర్జర్కు ఐపీఎఫ్టీ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. “టిప్రాల్యాండ్ కోసం కృషి చేస్తున్న దేబ్ బర్మ పార్టీలతో కలుస్తాము,” అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార రియంగ్ చెప్పడం గమనార్హం.