ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణానదీ కరకట్టపై నివాసం ఉంటున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ ఇల్లు అటాచ్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు ప్రకటిస్తుందని ఆశించినా కోర్టు మాత్రం మళ్లీ వాయిదా వేసింది.
చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న సీఐడీ విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు ప్రస్తుతానికి అంగీకరించలేదు ఈ మేరకు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. చంద్రబాబు ఇల్లు అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చే ముందు సదరు అధికారిని విచారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీంతో చంద్రబాబు ఇంటి అటాచ్ మెంట్ కు ఇప్పుడు అనుమతి ఇవ్వలేమని కోర్టు చెప్పినట్లయింది.
మే 18న చంద్రబాబు ఇల్లు అటాచ్ మెంట్ కోసం జారీ చేసిన నోటీసుల్ని ఈ ఇంటి యజమాని లింగమనేని రమేష్ కు ఇవ్వాలని ఏసీబీ కోర్టు సీఐడీని ఆదేశించింది. వాటిని ప్రతివాదిగా ఆయన పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే చంద్రబాబు ఇల్లు అటాచ్ మెంట్ కోరిన అధికారిని విచారించే అధికారం కూడా తమకు ఉందని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు తన ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీ చేస్తున్న ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ లింగమనేని రమేష్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన కోర్టు.. అటాచ్ మెంట్ నోటీసుల్ని మాత్రం ఆయనకు ఇమ్మని ఆదేశించింది. తదుపరి విచారణలో వీటిపై వాదనలు వినబోతోంది. దీంతో ఈ వ్యవహారం మరోసారి వాయిదా పడినట్లయింది.