ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమాను ప్రారంభించారోకానీ అప్పటి నుంచి వాయిదాలు పడుతూనే ఉంది. అసలు పూర్తవుతుందో? లేదో? అనే సందేహాన్ని మహేష్ బాబు అభిమానులే వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వాయిదాలు పడుతూ, పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం షూటింగ్ మరోసారి వాయిదా పడింది.
సహ నటుల కాల్షీట్లు ఇబ్బందికరంగా మారడంతో జూన్ మొదటివారంలోనే జరగాల్సిన షూటింగ్ 12వ తేదీకి వాయిదా పడింది. అయితే తాజాగా అదికూడా వాయిదా పడినట్లు సమాచారం. ఎలాగూ వాయిదా పడింది కాబట్టి వాయిదాలో వాయిదా కింద మరో నాలుగు రోజులు వాయిదా వేద్దామనుకున్నారో ఏమోకానీ ఈనెల 16వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.
ఈనెల 16వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించి సెప్టెంబరు, అక్టోబరులోగా సినిమాను పూర్తిచేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్న కాబట్టి అక్టోబరులోపు పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ తోపాటు విఎఫ్ ఎక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. మూవీ విషయానికొస్తే సాధారణంగా మహేష్ తన సినిమాల్లో కండలు చూపించటం, సిక్స్ ప్యాక్ లుక్ ఇంతవరకు చూపించలేదు. త్రివిక్రమ్ మాత్రం ఈసారి అలా కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేష్ బాబును మాత్రం ఒప్పించారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ లుక్‌తో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.