ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్నితీసుకుంది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొచ్చింది.
ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు. వారిపై పీఎంఎల్ఏలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.
అంతేకాదు- జీఎస్టీ నెట్‌వర్క్‌లో ఉన్న సమాచారం మొత్తాన్ని కూడా పీఎంఎల్ఏ కింద అధికారులు పరస్పరం పంచుకోవచ్చు. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న వారిపై పీఎంఎల్ఏ కింద నిఘా ఉంచడానికీ వెసలుబాటు లభించినట్టయింది. నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లు, నకిలీ ఇన్‌వాయిస్‌లు తీసుకోవడం వంటి జీఎస్టీ నెట్‌వర్క్ పరిధిలోని ఆర్థిక నేరాలను ఇకపై అత్యంత తీవ్రమైనవిగా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి తీసుకొచ్చినట్టయింది. మనీలాండరింగ్ కింద అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చర్యలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా చర్యలకు దిగుతుంది.
ఈడీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు ఇకపై జీఎస్టీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న పూర్తి సమాచారాన్ని పంచుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ జాబితాలో ఇప్పటివరకు 25 సంస్థలు ఉన్నాయి. జీఎస్టీ నెట్‌వర్క్.. 26వది. దీన్ని పీఎంఎల్ఏ పరిధిలోకి చేర్చడానికి చట్టంలోని సెక్షన్ 66కు మార్పులను ప్రభుత్వం నోటిఫై చేసింది.
నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కేసులపై ఈడీ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను పొందడానికి నకిలీ పాన్-ఆధార్ కార్డులను వినియోగిస్తోన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. మనీలాండరింగ్ కోసం డొల్ల కంపెనీల ఏర్పాటు చేసినట్లు గుర్తించింది.
కేంద్రం, రాష్ట్ర జీఎస్టీ అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫీల్డ్ టాక్స్ అధికారులు 60 వేల కంటే ఎక్కువ జీఎస్టీ ఖాతాలను గుర్తించగా.. అందులో 25 శాతం నకిలీవిగా తేలాయి. ఇప్పటివరకు 11 వేలకు పైగా జీఎస్టీఐఎన్‌లను వారు రద్దు చేశారు. వీటిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.