National

భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ petrol 60 రూపాయలే..

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. ఏపీలో తిరుపతి(Tirupati) వద్ద రేణిగుంట నుండి నాయుడుపేట NH71 హైవేపై ఈ కార్యక్రమం జరిగింది.

ప్రధానమంత్రి చొరవతో గ్రీన్ ఇండియా మిషన్ (GIM) భాగస్వామ్యంతో జతకట్టి జాతీయ రహదారులను పర్యావరణపరంగా గ్రీన్ హైవేలుగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రహదారి ప్రాజెక్టుల సమయంలో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెండింతలు చెట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా నాటనున్నారు.

ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా రహదారులపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. పర్యావరణ కాలుష్యానికి 40 శాతం కారణం రహదారుల శాఖనే. పెట్రోల్ వినియోగంతో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకే ఇతర మార్గాలపై అన్వేషణ చేస్తున్నాము. ప్రత్యామ్నాయ ఇంధన వనరులయిన ఇథనాల్, మిథనాల్ వినియోగంపై దృషి పెట్టాము. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర 15 రూపాయలకు పడిపోతుంది. బయో ఇథనాల్ పెట్రోల్ చక్కని ప్రత్యామ్నాయం. బయో ఇథనాల్ తో నడిచే ద్విచక్ర వాహనాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయి. పర్యావరణ పరిరక్షణలో ఇథనాల్ సహాయపడుతుంది. పెట్రోల్ లీటర్ 110 రూపాయలు ఉండగా, ఇథనాల్ 60 రూపాయలకే లభిస్తుంది. కార్బన్ రహిత ఇంధనాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలోని ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. NHAI, PWD మరియు NHIDCLతో కలిసి దేశవ్యాప్తంగా 300,000 మొక్కలను నాటాలని ప్లాన్ చేశాము. ఈ పనిని పూర్తి చేయడానికి ఎంతోమంది వాలంటీర్లు మరియు విద్యార్థులు భాగం కానున్నారు. ఈ చొరవ వాతావరణ మార్పుల ద్వారా ఎదురయ్యే సవాళ్లకు ప్రతిస్పందనగా పనిచేస్తుంది, మొక్కల పెంపకం కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది అని తెలిపారు నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో పాటు పలువురు లోకల్ నాయకులు పాల్గొన్నారు.