థర్డ్ పార్టీ యాప్‌కు వెళ్లకుండానే అమెజాన్, స్విగ్గీ వంటి యాప్‌లలో ట్రాన్సాక్షన్లు
యూపీఐ ప్లగ్‌ఇన్‌తో పెద్దగా బెనిఫిట్స్ ఉండవంటున్న ఫోన్‌పే
మర్చంట్లపై మరింత భారం పడుతుందని వెల్లడి
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) వ్యాపారుల కోసం తీసుకొచ్చిన కొత్త ఇన్నోవేషన్ ఫీచర్ యూపీఐ ప్లగ్‌ఇన్ ఫోన్‌పే, గూగుల్ పే వంటి కంపెనీలను ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాపారులు ఈ ఫీచర్ ద్వారా డైరెక్ట్‌గా పేమెంట్స్ సేకరించడానికి వీలుంటుంది. థర్డ్ పార్టీ యాప్‌లను వాడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు స్విగ్గీ యాప్‌ను వాడుతున్న ఒక కస్టమర్ యూపీఐ పేమెంట్స్‌ను ఎంచుకుంటే గూగుల్ పే లేదా ఫోన్‌పే వంటి థర్డ్ పార్టీ యాప్‌లోకి వెళ్లి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పూర్తయ్యాక తిరిగి స్విగ్గీకి రీడైరెక్ట్ అవుతారు.
కానీ, ఈ అదనపు స్టెప్ వలన పేమెంట్స్ ఫెయిల్ అవకాశం ఎక్కువగా జరుగుతోంది. పేమెంట్స్ ఫెయిల్యూర్స్‌ను యూపీఐ ప్లగ్‌ఇన్ ద్వారా తగ్గించుకోవచ్చు. యూపీఐ ప్లగ్‌ఇన్ లేదా మర్చంట్ ఎస్‌డీకే (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్) ద్వారా కస్టమర్లు యాడ్ చేసే వర్చువల్ పేమెంట్ అడ్రస్ నుంచి మనీని కలెక్ట్ చేసుకోవడానికి వ్యాపారులకు వీలుంటుంది. అంటే పైన ఉదాహరణలో స్విగ్గీ యాప్‌లోనే పేమెంట్ కూడా జరిగిపోతుందన్న మాట. పేటీఎం, రేజర్‌పే, జస్‌పే వంటి పేమెంట్ గేట్‌వే అండ్ ప్రాసెసింగ్ సంస్థలు తమ మర్చంట్లకు యూపీఐ ప్లగ్‌ఇన్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
పేమెంట్స్ సక్సెస్ రేట్‌ను 15 శాతం వరకు పెంచుతామని చెబుతున్నాయి. మరోవైపు ఫోన్‌పే లాంటి కంపెనీలు ఈ ఫీచర్ వలన పెద్దగా ఉపయోగం లేదని, టెక్నికల్‌గా ఎక్కువ బెనిఫిట్స్ ఏం లేవని అంటున్నాయి. ప్రస్తుతం పేమెంట్ యాప్‌లు చేస్తున్న పని స్పాన్సర్ బ్యాంకులు, మర్చంట్ యాప్‌లకు యూపీఐ ప్లగ్‌ఇన్ షిఫ్ట్ చేస్తోందని, సక్సెస్ రేటు పెరగడానికి టెక్నికల్‌గా పెద్ద మార్పులేవి లేవని ఫోన్‌పే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీఓ) రాహుల్ చారి పేర్కొన్నారు. ఈ విధానం వలన పేమెంట్స్ సిస్టమ్ మరింత క్లిష్టంగా మారుతుందని, మర్చంట్లపైన ఒత్తిడి పెరుగుతుందని వివరించారు.
ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యం తగ్గించేందుకు..
యూపీఐ ట్రాన్సాక్షన్లలో ఫోన్‌పే, గూగుల్ పే మార్కెట్‌లో లీడర్లగా కొనసాగుతున్నాయి. వీటి నుంచి మార్కెట్ షేర్‌ను ఇతర ప్లేయర్లు కూడా దక్కించుకునేలా ఎన్‌పీసీఐ అవకాశం కలిపిస్తోంది. ఏ కంపెనీ వాటా కూడా 30 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని వాట్సాప్ పే రాకముందే ఎన్‌పీసీఐ రూల్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఫోన్‌పే, గూగుల్ పే తమ వాటాను 2024, డిసెంబర్ 31 లోపు తగ్గించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌లో 47 శాతం మార్కెట్‌తో ఫోన్‌పే నెంబర్ వన్ పొజిషన్‌లో, 33 శాతం మార్కెట్ షేర్‌తో గూగుల్ పే రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. యూపీఐ ప్లగ్‌ఇన్ ఫీచర్‌తో స్విగ్గీ, అమెజాన్, జొమాటో వంటి మర్చంట్ యాప్‌లు మనీని డైరెక్ట్‌గా కలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది.
ఇదే జరిగితే ఫోన్‌పే, గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్లలో 57 శాతం వాటా మర్చంట్ ట్రాన్సాక్షన్లదే. మర్చంట్ ట్రాన్సాక్షన్లపైనే ఆన్‌లైన్ పేమెంట్ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయి.
అంత ఈజీ కాదు..
యూపీఐ ప్లగ్‌ఇన్‌ను తీసుకొచ్చే ముందు వ్యాపారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్లలో ఈ ఫీచర్‌ను యాడ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ పే లేదా ఫోన్‌పే మాదిరి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) గా మారాల్సి ఉంటుంది. టాటా న్యూ, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ విధానాన్ని ఫాలో అయ్యాయి. ఏ స్టార్టప్ లేదా మర్చంట్ అయినా టీపీఏపీ యాప్‌గా మారొచ్చు. కానీ, ఎన్‌పీసీఐ నుంచి అనేక అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందులో పేపర్ వర్క్, రూల్స్ ఫాలో కావడం, సర్టిఫికేషన్స్ వంటి వాటికి ఏడాది కంటే ఎక్కువే టైమ్ పడుతుందని అంచనా. ‘ఫ్లిప్‌కార్ట్ లేదా క్రెడ్ వంటి పెద్ద కంపెనీలు ఏడాది కంటే ఎక్కువ కాలం వెయిట్ చేయగలవు. కానీ, యూపీఐపై ఆధారపడే చిన్న స్టార్టప్‌లు అంత టైమ్ వెయిట్ చేయలేవు. వీటి దగ్గర టెక్నికల్ స్టాఫ్ కూడా తక్కువగా ఉంటుంది’ అని ఓ పేమెంట్స్ కంపెనీ ఫౌండర్ పేర్కొన్నారు.
మరోవైపు యూపీఐ ప్లగ్‌ఇన్ తేవడంపై మర్చంట్లు కొంత వెనకడుగేస్తున్నారు. యూపీఐ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి వీరు సింగిల్ బ్యాంక్‌తో టై అప్ అవ్వాల్సి ఉంటుందని, బ్యాంక్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఇబ్బంది పడతామని ఆందోళన చెందుతున్నారు.