ఎన్ని కూటములు కట్టినా బీజేపీని ఏం చేయలేరని అర్థమైంది. ఎంతమంది కలిసినా మోడీని ఎదురించలేదని తేలింది. ఇండియా కూటమి పుంజుకున్నా అధికారం సాధించేనన్ని సీట్లు రావని తేలింది.
ఇండియా టుడే సర్వే సైతం మరోసారి మోడీదే విజయం అని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు జరిగితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 306 సీట్ల మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ పేర్కొంది.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272ను ఎన్డీఏ అధిగమిస్తుందని సర్వే వెల్లడించింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం.. ఎన్డిఎ 306 సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి 193 సీట్లు, ఇతర రాజకీయ పార్టీలు 44 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.
ఎన్డీఏ గతంలో సాధించిన సీట్ల కంటే ఈసారి సీట్లు తగ్గాయి. ప్రతిపక్షాలకు పెరగడం విశేషం. జనవరి 2023లో చేసిన సర్వే కంటే ఎనిమిది స్థానాల మెరుగుదల ఉంది. అయినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో NDA వాస్తవానికి గెలిచిన 357 సీట్ల కంటే ఇది ఇంకా తక్కువగా ఉంది.
కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమికి అంచనా వేసిన సీట్ల వాటా భారీగా పెరిగింది. జనవరి సర్వేలో కూటమికి 153 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇప్పుడు ఆగస్ట్ లో చేసిన సర్వేలో సీట్ల వాటాను 193కు పెంచుకోవడం ప్రతిపక్షాలకు బలం చేకూరినట్టైంది.
ఓట్ షేర్ విషయానికొస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 43 శాతం ఓట్లను గెలుచుకుంటుంది. అయితే ఇండియా ప్రతిపక్షాల కూటమి సైతం 41 శాతం ఓట్లను సాధిస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే పేర్కొనడం విశేషం. .
– వ్యక్తిగతంగా పార్టీలు సాధించే సీట్లు ఇవీ
పార్టీల వారీగా చూస్తే.. భారతీయ జనతా పార్టీ (BJP) 287 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది, సాధారణ మెజారిటీ 272కి అవసరమైన దానికంటే 15 ఎక్కువ సాధిస్తుందని తెలిపింది.. కాంగ్రెస్ వ్యక్తిగతంగా 74 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
అన్ని రాష్ట్రాలలో మొత్తం 25,951 మంది ఓటర్లను ఇంటర్వ్యూ చేశారు. సాధారణ ట్రాకర్ డేటా నుండి అదనంగా 1,34,487 ఇంటర్వ్యూలు విశ్లేషించబడ్డాయి. మొత్తం 1,60,438 అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే చేశారు. జూలై 15 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ అభిప్రాయ సేకరణ జరిగింది.