స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు అలర్జీ సోకినట్లు సమాచారం.
కొన్ని రోజులుగా ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజమండ్రి జైలుకు చంద్రబాబు వచ్చి 33 రోజులు పూర్తయింది. ఈ మధ్య ఎండ వేడిమి పెరగడంతో 73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన డీహైడ్రేషన్ కు కూడా గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే జైళ్ల శాఖ మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చేసింది. ఇప్పుడు చంద్రబాబుకు ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. దీనిపై వైద్యులు కానీ, రాజమండ్రి జైలు అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం ఏపీలోని పలు నగరాలు, పట్టణాల్లో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. రాజమండ్రిలోనూ ఎండ వేడిమి ఎక్కువగా ఉంటోంది. దీంతో చంద్రబాబు జైలు వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తనను ములాఖత్ లో కలుస్తున్న కుటుంబ సభ్యులతో పాటు నేతలతోనూ చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం వీటిపై ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడు స్కిన్ అలర్జీ కూడా సోకి ఉండొచ్చని చెబుతున్నారు.
చంద్రబాబు రాజమండ్రి జైలుకు వచ్చాక డెంగీ దోమల బాధ ఎక్కువగా ఉండటంతో జైలు అధికారులు ఫాగింగ్ చేయించారు. అయితే ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు జైల్లో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో అధికారులు కూడా చేసేందుకు ఏమీ లేకుండా పోతున్నట్లు తెలుస్తోంది.