National

ఆగని రైతు నిరసనలు.. మార్చి 6న ఢిల్లీ చలో, 10న దేశ వ్యాప్త రైల్ రోకోకు పిలుపు ..

మద్దతు ధర సహా పలు డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. మార్చి 6న ఢిల్లీలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని రైతులు సంఘాలు కోరాయి. అంతేగాక, మార్చి 10న దేశ వ్యాప్తంగా రైల్ రోకో చేపట్టాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాల నేతలు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జీత్ సింగ్ డాల్లేవాల్ ఇటీవల ఘర్షణలో మృతి చెందిన రైతు స్వగ్రామం బల్లోహ్‌లో మీడియాతో మాట్లాడారు.

 

ప్రస్తుతం ఉన్న నిరసన కేంద్రాల వద్ద రైతుల ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నేతలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శంభు, ఖానౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద జరుగుతున్న ఆందోళనకు పంజాబ్, హర్యానా రైతులు మద్దతు కొనసాగిస్తుండగా.. మార్చి 6న ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు రాజధాని ఢిల్లీకి చేరుకుని నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాలు నిర్ణయించాయని కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం) నేత సర్వన్ సింగ్ తెలిపారు.

 

ట్రాక్టర్ ట్రాలీల్లో చేరుకోలేని దూర ప్రాంతాల రైతులు రైళ్లు, ఇతర రావాణా మార్గాల ద్వారా ఢిల్లీకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు రెండు ఫోరంలు మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశంలో రైల్ రోకో చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. రైతుల డిమాండ్లకు మద్దతుగా అన్ని పంజాబ్ పంచాయతీలు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ సరిహద్దు పాయింట్ల వద్దకు చేరుకుంటుందన్నారు.

 

మరోవైపు, ఢిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకునేందుకు కేంద్రం అన్ని వ్యూహాుల పన్నిందని ఆ రైతు నేత తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు పంజాబ్ కే పరిమితమని, కేవలం రెండు ఫోరంలు మాత్రమే ఈ పోరాటాన్ని నడిపిస్తున్నాయన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు సర్వన్ సింగ్. కానీ, దేశంలో 200 కంటే ఎక్కువ రైతు సంఘాలు ఈ రెండు ఫోరంలలో భాగమేనని చెప్పుకొచ్చారు. రైతుల సమస్య పరిష్కారం కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చినా నిరసన చేపడతామన్నారు.