National

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఐదుగురి పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జిలుగా ఉన్న జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది కొలీజియం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన కొలిజియం మంగళవారం సమావేశమైంది.

సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా నియామకంపై ఓ స్పష్టత రావటంతో కొలీజియం తాజా సిఫారసులను చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిలుగా నియమించాలంటూ ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. జస్టిస్ పంకజ్ మిథల్ ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అంతకు ముందు ఆయన జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ చీఫ్ జస్టిస్‍గానూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పట్నా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కరోల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక జస్టిస్ పీవీ సంజయ్ కమార్.. మణిపూర్ ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్‍గా ఉన్నారు.

జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా.. పట్నా హైకోర్టులో జడ్డిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ మనోజ్ మిశ్రా.. అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఈ ఐదుగురి పేర్లను సుప్రీం కొలిజియం ప్రతిపాదించింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 28 మంది జడ్జిలే ఉన్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా.. సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు, 2023లో తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు.