వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది విశ్రాంత సైనికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్ ఈ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. Cabinet revises OROP: 2019 నుంచి ఏరియర్స్ ఈ ఓఆర్ఓపీ(OROP) బకాయిలను 2019 జులై 1 వ తేదీ నుంచి 2022 జూన్ 30 వరకు లెక్కించి, చెల్లిస్తారు. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 8450 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో 25.13 లక్షల మంది రిటైర్డ్ సైనికోద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 2019, జూన్ 30 న లేదా అంతకన్నా ముందు పదవీ విరమణ చేసిన సుమారు 25 లక్షలమంది సాయుధ దళాల ఉద్యోగులు ఈ OROP పథకం పరిధిలోకి వస్తారు.
అర్హులైన విశ్రాంత సైనికులు, లేదా వారి కుటుంబ సభ్యులకు ఈ బకాయిలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. గాలంట్రీ అవార్డు విన్నర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, లిబరలైజ్డ్ ఫ్యామిలీ పెన్షనర్లకు ఒకే విడతలో ఏరియర్లను చెల్లిస్తామన్నారు. Cabinet revises OROP: పీఎంకు రాజ్ నాథ్ థ్యాంక్స్ ‘విశ్రాంత సైనికోద్యోగుల చిరకాల డిమాండ్ OROP పై సానుకూలంగా స్పందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. విశ్రాంత సైనికోద్యోగుల ఈ OROP డిమాండ్ పై గత ప్రభుత్వాలేవీ సానుకూలంగా స్పందించలేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ విషయమై వారికి హామీ ఇచ్చామని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.