TELANGANA

రేవంత్ తో కోమటిరెడ్డి భేటీ.. గొడవ సర్ధుమనిగినట్లేనా?

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు ఠాక్రే ఫోన్ చేసిన కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్ లో ప్రత్యక్షమయ్యాడు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.

కాసేపు వీరిద్దరూ సీరియస్ గా చర్చించుకోవడం కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికల సమయం నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మరియు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవడం ఇదే ప్రథమం. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగి పోయాయా.. గొడవ సర్ధుమనిగినట్లేనా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భేటీ కి ముందు కోమటిరెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు గాంధీ భవన్ కి రాలేక పోయాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కోమటిరెడ్డి అన్నారు. ఖమ్మం లో పెట్టిన సభలు ఎన్ని పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్‌ ఏం చేయలేడు అంటూ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నాడు.