TELANGANA

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరట

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మహారాష్ట్ర, బెంగాల్‌లలో అధికార బీజేపీ, టీఎంసీల సిట్టింగ్‌ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌..తమిళనాడులో సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుంది.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలోని సాగర్‌దిఘి స్థానంలో అధికార టీఎంసీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక్కడ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన కాంగ్రెస్‌కు చెందిన బేరన్‌ బిశ్వాసం సుమారు 23 వేల ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

ఈ గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీ ఏకైక ఎమ్మెల్యేతో బెంగాల్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టనుంది. మహారాష్ట్రలోని కస్బాపేత్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రవీంద్ర దంగేకర్‌ కాషాయ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. బీజేపీ గత 28 ఏళ్లుగా ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. అయితే, ఇదే రాష్ట్రంలోని చించ్‌వాడీ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. తమిళనాడులోని ఈరోడ్‌ వెస్ట్‌ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డీఎంకే బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఈవీకేఎస్‌ ఎలంగోవన్‌ భారీ విజయం సాధించారు. జార్ఖండ్‌లోని రామగఢ్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన ఏజేఎస్‌యూ అభ్యర్థి గెలిచారు.