TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు తుది రాతపరీక్షలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు తుది రాతపరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్‌ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్‌, అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తుది రాత పరీక్షను హైదరాబాద్‌ కేంద్రంలో నిర్వహించున్నారు. ఏప్రిల్‌ 2వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం (మార్చి 28) ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదల చేసింది.

 

తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు మంగళవారం (మార్చి 28) రాత్రి నుంచి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వివరించారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 93937 11110 లేదా 93910 05006 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని, లేనిపక్షంలో దాన్ని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు