తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా కేంద్రమంత్రులు ఎవరైనా పర్యటనకు వచ్చిన ప్రతీసారి సిఎం కేసీఆర్ ఏదో ఓ రూపంలో వ్యతిరేకత తెలియజేస్తుంటారు.
శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చినప్పుడు కూడా మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సింగరేణి బొగ్గుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి పరిధిలో ధర్నాలు చేశారు. “మోడీ హటావో సింగరేణి బచావో” (మోడీని తొలగించి సింగరేణిని కాపాడుకొందాము) అంటూ నినాదాలు చేశారు.
ప్రధాని మోడీ సికింద్రాబాద్-తిరుపతి మదే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన తర్వాత రూ. 11,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రిమోట్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించి అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
మొదట్లో మోడీతో చాలా సక్యతగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు కత్తులు దూయడానికి అనేక కారణాలు చెపుతున్నప్పటికీ అసలు కారణం తెలంగాణలో బిజెపి బలపడుతుండటమే! తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండటమే ప్రధాన కారణమని అందరికీ తెలుసు.
తాను పదేళ్ళు పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన కష్టార్జితంతో సంపాదించుకొన్న లేదా గెలుచుకొన్న సొంత రాజ్యంగా భావిస్తున్నారు. కనుక తన రాజ్యానికి తన కొడుకు కేటీఆర్ వారసుడు కావాలని కోరుకొంటున్నారు. కానీ మద్యలో బిజెపి చొచ్చుకు వచ్చింది. కనుక కేసీఆర్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి కేంద్రంతో యుద్ధం మొదలుపెట్టారని చెప్పవచ్చు,
సింగరేణి గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. నిజానికి తెలంగాణలో ఒక్కటే కాదు. దేశవ్యాప్తంగా కేంద్రానికి ఉన్న అనేక బొగ్గు గనులను వేలం వేస్తోంది. ఒకవేళ అవి సింగరేణికే అవసరమనుకొంటే, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థ స్వయంగా ఆ వేలంపాటలో పాల్గొని గనులు దక్కించుకోవచ్చు. సింగరేణి సంస్థ ఒడిస్సాలో అలాగే వేలంపాడుకొని బొగ్గు తవ్వకాలు జరుపుకొంటోంది. అదేవిదంగా సింగరేణిలో వేలం వేస్తున్న గనులను దక్కించుకోవచ్చు. కానీ లక్షల కోట్లు విలువ కలిగిన గనులను ఉచితంగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిచాలని కేసీఆర్ కోరుకొంటున్నారు!
అది సాధ్యం కాదని కేసీఆర్‌కు కూడా తెలుసు. అలాగే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వాటాలో బొగ్గు గనులను మాత్రమే వేలం వేస్తోంది తప్ప సింగరేణిలో అన్ని గనులను కాదు. కానీ కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం సింగరేణి మొత్తాన్ని మోడీ ప్రభుత్వం అమ్మేస్తోందంటూ దుష్ప్రచారం చేస్తూ కార్మికులను, ప్రజలను రెచ్చగొట్టి వారిలో బిజెపి పట్ల వ్యతిరేకత, బిఆర్ఎస్ కోసం తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.
ఒకవేళ కేసీఆర్ మాటలు నమ్మి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడుస్తున్న సింగరేణి గనులన్నిటిలో కార్మికులు ధర్నా చేస్తే నష్టపోయేది తెలంగాణ రాష్ట్రామే తప్ప కేంద్ర ప్రభుత్వం కాదు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి ఆటకం ఏర్పాడుతుంది. దాని వలన విద్యుత్ కొరత ఏర్పడి, కోతలు విధించాల్సి వస్తే తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తీవ్రంగా నష్టపోతాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ కొరత ఏర్పడితే సాగునీటి సరఫరా నిలిచిపోతుంది. దాంతో రైతులు నష్టపోతారు. ఒక రాజకీయ కారణంతో ప్రభుత్వమే ఈవిదంగా ధర్నాలు చేయిస్తుంటే కంటికి కనబడని అపార నష్టం జరుగుతుంటుంది. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం కేసీఆర్ ఇంకా ఎంత నష్టమైన భరించవచ్చు కానీ రాష్ట్రం, ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?అనే ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.