హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు.
దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడటంతో పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి రసీదు లేనివాటిని స్వాధీనం చేసుకుని.. కేసులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.
మరోవైపు, నిజాం కాలేజీ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్ నెంబర్ 1 వద్ద 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్ చేసినట్లు సమాచారం. ఫిలింగనర్ పరిదిలోని షేక్‌పేట్ నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఎలాంటి రసీదు లేకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఎల్బీనగర్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద లభించిన రూ. 4 లక్షలను సీజ్ చేశారు. రాయికల్ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ. 11.5 లక్షలు పట్టుబట్టాయి. మరోవైపు, శేరిలింగంపల్లి గోపన్ పల్లి తాండాలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కుక్కర్లు పంచుతున్న రాములు నాయక్, నర్సింహా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కర్లపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత రఘునాథ్ స్టిక్కర్లు ఉండటం గమనార్హం.
ఇది ఇలావుండగా, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 12.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. వైరా సబ్ డివిజన్ పరిధిలోని మూడు చోట్ల నగదును పట్టుకున్నారు. వైరా సమీపంలో తరలిస్తున్న రూ. 5 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. కాగా, రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళితే అందుకు సంబంధించిన సరైన పత్రాలు ఉండాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నగదుతోపాటు బంగారం ఆభరణాలు తీసుకెళ్లినా పత్రాలు ఉండాలని అంటున్నారు.