TELANGANA

మూన్నూరు కాపు కులస్తుల ఫైట్‌.. ఓటర్లు ఎవరు పక్షాన!

అసెంబ్లీ ఎన్నికల్లో కుల రాజకీయాలు పీక్స్‌కి చేరుతున్నాయి. కులాల ఓట్లు రాబట్టేందుకు అదే సామాజికవర్గం అభ్యర్థులను పార్టీలు బరిలో దింపడం కామన్‌ అయిపోయింది. అభ్యర్థి గుణగణాల కంటే కులగణానాలకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే అన్ని చోట్లా ఇదే ఫార్మూలా కాకుండా డిఫరెంట్‌ వ్యూహాలు రచిస్తున్నాయి. కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులను పోటీలో దింపుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గం నాయకులను రంగంలోకి దింపాయి.

 

మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందిన నాయకులను బరిలో నిలిపి ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. మరి మున్నూరు కాపులు ఎవరి పక్షాన నిలుస్తారో అనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ గాలి వీస్తుండగా బీఆర్ఎస్‌, బీజేపీ అలర్ట్‌ అవుతున్నాయి.

 

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులుగా మున్నూరు కాపు సామాజికవర్గం నేతలనే ఎంచుకున్నాయి. ఎమ్మెల్యే గెలుపు పోరు కాస్తా మూన్నూరు కాపు కులస్తుల ఫైట్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ నాలుగోసారి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పురుమల్ల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో వెలమల కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ప్రస్తుతం మున్నూరు కాపుల ప్రాబల్యం పెరిగింది. అందుకే మూడు ప్రధాన పార్టీలు మున్నూరు కాపులకే టికెట్లు కేటాయించాయి. మరి ఆ సామాజికవర్గం ఓటర్లు ఎవరి పక్షాన ఉంటారోనని నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

 

కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో 3 లక్షల 40 వేల మంది ఓటర్లు ఉన్నారు. వాళ్లలో ప్రధానంగా గెలుపోటములు నిర్ణయించేది మున్నూరు కాపులు, ముస్లిం ఓటర్లు. మున్నూరు సామాజిక వర్గం, ముస్లిం ఓటర్లు లక్ష మందికి పైగానే ఉన్నారు. రెండు వర్గాలది సమానమైన ఓట్‌షేర్‌. ప్రధాన పార్టీలకి ఇప్పుడు ఈ రెండు సామజిక వర్గం ఓట్లే కీలకం కానుయ్యాయి. కరీంనగర్ నగరంతో పాటు గ్రామాల్లోనూ మున్నూరు కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. లక్ష ఓట్లకి పైగా ఈ రెండు సామజిక వర్గం ఓటర్లే ఉండడంతో అన్ని పార్టీలకి వీళ్ల నిర్ణయం కీలకం కానుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థులతో పాటు స్టార్‌ క్యాంపెయినర్లు ఓట్ల వేటను ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ సొంత ఇమేజ్‌తో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకే సీఎం పదవి అని బీజేపీ ప్రకటించగా తాను కూడా అదే వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల జనంలో ఊపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారసభల్లో సీఎం.. సీఎం.. అంటూ శ్రేణులు ఉత్సాహం ప్రదర్శిస్తుండగా.. అలా అంటే ఉన్నపదవి ఊడిపోయిందని సెటైర్లు వేస్తున్నారు సంజయ్‌.

 

కరీంనగర్‌ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌, బీజేపీ ఫోకస్‌ పెంచాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి… ధర్మపురి, రామగుండం నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. AICC అగ్రనేత రాహుల్‌గాంధీ…. మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించి కరీంనగర్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు మరికొందరు కూడా ప్రచార పర్వంలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న కరీంనగర్‌ జిల్లాలో వివిధ పార్టీల అగ్రనేతలు పర్యటనలతో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. జిల్లా వ్యాప్తంగా నువ్వా-నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ వ్యాప్తంగా హస్తం పార్టీకి ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. అభయహస్తం 6 గ్యారెంటీలతో పాటు బీఆర్ఎస్‌పై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉమ్మడి జిల్లా పరిధిలో పర్యటించారు. సిరిసిల్ల, మంథని, పెద్దపల్లి, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల్ ప్రచారం చేశారు. కరీంనగర్‌ అసెంబ్లీ పరిధిలో బిగ్‌ఫైట్‌గా భావిస్తున్న గులాబీ బాస్‌ ఈ నెల 17న మంత్రి గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అలాగే చొప్పదండి, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లోనూ కేసీఆర్‌ పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు వెన్నంటి ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ గాలులు వీస్తున్నాయన్న ప్రచారం జరుగుతుండడంతో గులాబీ అధినేత ఫోకస్‌ మరింత పెంచారు. సుమారు ఏడు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదురవుతుండగా వారి ప్రభావాన్ని తట్టుకుని తిరిగి అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేసేలా చూడాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టిసారించారని బీఆర్ఎస్‌ నేతలు చెబుతున్నారు.

 

కరీంనగర్‌ జిల్లాపై ఫోకస్‌ పెట్టిన బీజేపీ ప్రధాని మోడీని రంగంలోకి దింపుతోంది. పార్టీ నుంచి ఇద్దరు నేతలు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఈ ఉమ్మడి జిల్లా పరిధిలోనే పోటీలో ఉండగా తగిన ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ఇద్దరు నేతలు సీఎం అభ్యర్థులనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, మంత్రి గంగుల కమలాకర్‌తో తలపడుతున్నారు. హుజూరాబాద్‌లో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌, MLC పాడి కౌశిక్‌ రెడ్డితో పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు బీసీ నేతల గెలుపుపై బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. బండి సంజయ్‌ ఇప్పటికే పాదయాత్ర చేపట్టి కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడీ కరీంనగర్‌లో ఈనెల 25న జన గర్జన బహిరంగ సభకు వస్తున్నారు. ఈ సభతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ అభ్యర్థుల విజయానికి తోడ్పడేలా ప్రధాని సభకు కమలం పార్టీ ప్లాన్‌ చేసింది.

 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ హవా వీస్తోందనే సంకేతాలు బీఆర్ఎస్‌, బీజేపీని కలవరపెడుతున్నాయనే టాక్‌ నడుస్తోంది. అందుకే గులాబీ బాస్‌ కేసీఆర్‌తో పాటు ప్రధాని మోడీ సభలకు ప్లాన్‌ చేశారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ని తగ్గించే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌, మోడీ ప్రచారాన్ని హెరెత్తించాలనే నిర్ణయానికి వచ్చారని పొలటికల్ సర్కిల్స్‌లో టాక్‌ నడుస్తోంది.