TELANGANA

కేసీఆర్ తో ఆగవ్వ కటీఫ్.. బీజేపీలో చేరిన సీఎం దోస్తు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ సీఎం దత్తత గ్రామం వాసాలమర్రికి చెందిన కెసిఆర్ దోస్తు ఆగవ్వ బీజేపీలో చేరింది. భువనగిరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకుంది. ఆకుల ఆగవ్వ, గ్రామ ఉపసర్పంచ్ మధు, గ్రామస్తులకు శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నాటి నుంచి నేటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా కేసిఆర్ గ్రామస్తులను ఆగం చేశాడని అన్నారు. తన ఫామ్ హౌస్ కు వెళ్లే దారివేయడం కోసం వాసాలమర్రి గ్రామాన్ని ఆగం చేశాడని ఆయన మండిపడ్డారు.

 

More

From Telangana politics

ఫామ్ హౌస్ రోడ్డు కోసం..

యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం వాసాలమర్రికి 2021, జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాన్ని సందర్శించి, గ్రామస్థులతో కలిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. మండల కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరం, జిల్లా కేంద్రం భువనగిరి నుండి 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూలగొట్టాలని సూచించారు. రోడ్డును విస్తరిస్తానని తెలిపాడు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తాయన్న ఆశతో గ్రామస్తులంతా పాత ఇల్లును కూల్చి వేసుకున్నారు. గ్రామంలో రోడ్డును విస్తరించిన కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్గు గురించి పట్టించుకోవడం లేదు. దీంతో కేవలం తన ఫామ్ హౌస్ కు యాదాద్రి నుంచి నేరుగా రోడ్డు వేసుకోవడం కోసమే వాసాలమర్రిలో ఇల్లు కూలగొట్టించాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్ తన దొస్తుగా పరిచయం చేసిన ఆగవ్వ.. ఆతర్వాత ఆగమైంది. కేసీఆర్ దోస్తు అని ఆమెను కూలీ పనులకు కూడా పిలవడం లేదట. సీఎం హామీని నమ్మి ఉన్న ఇల్లు కూలగొట్టుకున్నారు. కొత్త ఇల్లు మంజూరు కాలేదు. దీంతో ఓ టార్పాలిన్ కవర్ తో నీడ ఏర్పాటు చేసుకుని కష్టంగా జీవనం సాగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆగవ్వ