TELANGANA

తెలంగాణలో సమన్వయకర్తలను నియమించిన కాంగ్రెస్..

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేసింది. 28 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను పలువురు మంత్రులు, ముఖ్య నేతలకు అప్పగించింది.

 

మహబూబ్‌నగర్, చేవెళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. మల్కాజిగిరికి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబాబాద్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్‌కు కొండా సురేఖ, ఆదిలాబాద్ నియోజకవర్గానికి సీతక్కకు బాధ్యతలను అప్పగించారు.

 

నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగర్ కర్నూల్ కు జూపల్లి కృష్ణారావు, మెదక్ నియోజకవర్గానికి దామోదర రాజనర్సింహ, నిజామాబాద్ నియోజకవర్గానికి జీవన్ రెడ్డి, జహీరాబాద్ కు సుదర్శన్ రెడ్డి, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించారు.

 

సచివాలయంలో రేపు సీఎం, మంత్రుల ప్రత్యేక సమావేశం

 

సోమవారం రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఊహించని స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అలానే దరఖాస్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో నిజమైన అర్హులను ఎలా గుర్తిస్తారు? తరవాత చేసే కంప్యూటరీకరణ ప్రక్రియ ఎలా ఉంటుంది? తదుపరి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీల అమలుపై సోమవారం సచివాలయంలో సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రజాపాలన వెబ్‌సైట్‌ www.prajapalana.telangana.gov.in ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.