తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకొనే ప్రయత్నం చేస్తోంది. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పేరు పైన చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్పు చేయాలని సీనియర్లు కోరుతున్నారు. మరి ఈ దిశగా కేసీఆర్ అంగీకరిస్తారా.
తిరిగి మారుస్తారా : బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ మార్చే ఆలోచన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేరులో తెలంగాణ లేకపోవటం నష్టం చేసిందనే అభిప్రాయంలో సీనియర్లు ఉన్నారు. దీంతో, తిరిగి పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. కొంత మంది ప్రజలు అలా భావించి పార్టీకి దూరమై ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తెలంగాణ ఇంటి పార్టీగా పేరులోనే తెలంగాణ ఉండాలనేది సీనియర్లు చెబుతున్న మాట. పార్టీ పేరులో తిరిగి తెలంగాణ చేర్చటం ద్వారా పూర్వవైభవం సాధ్యమేనని అంచనా వేస్తున్నారు.
సీనియర్ల కీలక వ్యాఖ్యలు : ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం. పార్టీ పేరులో ‘తెలంగాణ’ను తొలగించి, ‘భారత్’ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా పార్టీలో తిరిగి తెలంగాణ ఉండేలా బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలని కోరుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యతగా మారింది. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలనుకుంటే అలాగే ఉంచి.. రాష్ట్ర రాజకీయాలకు ‘టీఆర్ఎస్’ను తెర మీదకు తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇందులో న్యాయపరమైన అంశాలేమైనా ఉంటే మాజీ ఎంపీ వినోద్‌కుమార్ వంటివారు ఈ విషయంలో సంబంధిత నిపుణులతో చర్చిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ సిద్దమేనా : ఈ మార్పు అంశాన్ని కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి వివరించారు. అయితే, ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచన గా తెలుస్తోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురు కావటంతో ఇప్పుడు ముందుగా తెలంగాణలో తిరిగి బలం పెంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమయంలో పార్టీ మార్పు పైన చర్చ మొదలైంది. అదే విధంగా పార్టీ పరంగానూ కీలక పదవుల్లో మార్పులు జరుగుతాయని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్ పైన కేసీఆర్ తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.