ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. ఫలితంగా నాలుగు టెస్టుల బోర్డర్ – గావస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా సిరీస్ 2-1 తేడాతో ఉంది. అనంతరం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ భారత్ సొంతం అయింది.
అయితే ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(90) రాణించగా.. లబుషేన్(63*), స్మిత్(10*) చివరి వరకు కూడా క్రీజులో ఉన్నారు. అలాగే భారత బౌలర్లలో అశ్విన్ , అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. అలాగే అంతకముందు ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 480-10 పరుగులు చేయగా.. టీమిండియా కూడా తనదైన శైలిలో 571-10 పరుగులు చేసి 91 పరుగుల అధిక్యంతో తన తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కాగా, ఈ టెస్టులో ఆసీస్ తరఫున ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్(114) సెంచరీలు సాధించగా.. భారత్ తరఫున కూడా శుభమాన్ గిల్(128), కింగ్ కోహ్లీ(186) శతకాలతో రాణించారు.