National

భారతీయ విద్యార్ధులకు రిషీ సునక్ షాక్ ! వీసాలపై యూకే ఆంక్షలు-కుటుంబాలకు కష్టమే..!

భారతీయులకు సాటి భారతీయుడు, బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఇవాళ షాకిచ్చారు. భారతీయ విద్యార్ధులకు జారీ చేసే వీసాలపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

అంతే కాదు ఈ నెల నుంచి వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయించారు. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్ధులకు చుక్కలు కనిపించనున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తమతో పాటు తీసుకురావాలనుకుంటున్న విద్యార్ధులకు వీసాల జారీ కష్టతరం కానుంది.

బ్రిటన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరిశోధన కోర్సులు, ప్రభుత్వ-నిధుల స్కాలర్‌షిప్‌లకు మాత్రమే వీసా మినహాయింపులను అనుమతించాలని రిషీ సునాక్ ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటీష్ యూనివర్శిటీలలో చేరే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఈ కఠినమైన వీసా నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి.

బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఈ అంశాన్ని ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు నుండి, ఎక్కువ మంది విదేశీ విశ్వవిద్యాలయ విద్యార్థులు కుటుంబ సభ్యులను యూకేకి తీసుకురాలేరని, 2024లో తాము ఇప్పటికే బ్రిటిష్ ప్రజల కోసం ఎక్కువ వీసాలు ఇస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి గతేడాది మేలో మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ తొలిసారిగా ప్రకటించిన ఈ మార్పులు యూకేలో పనిచేయడానికి బ్యాక్‌డోర్ రూట్‌గా స్టూడెంట్ వీసాను ఉపయోగించే వ్యక్తులను అరికట్టడానికి ఉద్దేశించబడినట్లు ప్రభుత్వం తెలిపింది.

తాజా ఆంక్షలు బ్రిటన్ కు విదేశీ విద్యార్థులు తమపై ఆధారపడుతున్న వారిని తీసుకురావడాన్ని అరికట్టేందుకు ఉద్దేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2019 నుండి ఇలా విదేశీ విద్యార్ధులు తమ వీసాలపై కుటుంబ సభ్యులను తీసుకురావడం 930 శాతానికి పైగా పెరిగినట్లు అంచనా. బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయం వలసలను తగ్గించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.