TELANGANA

రూ.500 నోట్లు కూడా రద్దు చేయండి- కేంద్రానికి చంద్రబాబు సలహా: నా వల్లే డిజిటల్ కరెన్సీ

రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.

పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది.

మహానాడులో చంద్రబాబు- ముగింపు ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్తామంటూ హెచ్చరించారు. ఇప్పటివరకు తన మంచితనాన్నే చూశారని, తనలోని రెండో కోణాన్ని చూస్తారంటూ గర్జించారాయన. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూసినవారు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. రౌడీయిజం, గూండాయిజాన్ని సహించబోనని, వారిని అణగదొక్కుతానని స్పష్టం చేశారు.

 

తెలుగుదేశం పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే- ఇప్పటివరకూ ఎవరూ చూడనటువంటి సమర్థవంతమైన పరిపాలను అందిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పారు. తనకు మరోసారి అధికారం ఇస్తే సంపదను సృష్టిస్తానని, దాన్ని పేదలకు పంచిపెడతానని అన్నారు. ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను స్వీకరిస్తానని, చెప్పింది వింటానని స్పష్టం చేశారు.

మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. మహిళల స్వయం సమృద్ధి, యువతకు ఉపాధి కల్పించడాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు. ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. ఆయా హామీలన్నింటి గురించి పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు.

 

తాను చెప్పడం వల్లే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను రద్దు చేసిందంటూ చంద్రబాబు పునరుద్ఘాటించారు. అవినీతి అంతం చేయడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి పెద్ద నోట్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందంటూ తాను ఎప్పుడో కేంద్రానికి సూచించానని గుర్తు చేశారు. ఆ తరువాతే కేంద్రం వాటిని రద్దు చేసిందని అన్నారు.

ఇప్పుడు 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. 500 రూపాయల నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి మహానాడు వేదికగా సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయల చొప్పున 2,000 నోట్లను పంపించడాని, ఇప్పుడు వాటన్నింటినీ 500 రూపాయలుగా మార్చుకుంటోన్నాడని చంద్రబాబు ఆరోపించారు.

దేశంలో డిజిటల్ కరెన్సీ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేటీఎం, గూగుల్ పే.. వంటి టెక్నాలజీని ముందు చూపుతో అమలు చేయడం వల్లే దేశం డిజిటల్ కరెన్సీలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తానే రిపోర్ట్ ఇచ్చానని పేర్కొన్నారాయన. సాంకేతిక పరిజ్ఞానంతో సుపరిపాలన అందిస్తానని అన్నారు.