World

గుంజీలు తీస్తే ఫ్రీ బస్ టికెట్.

చిన్నప్పుడు తప్పు చేస్తే టీచర్లు గుంజీలు తీయించిన చిన్న నాటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తున్నాయి. అప్పుడు తప్పు చేస్తే టీచర్లు శిక్ష కింద గుంజీలు తీయించే వాళ్లు. కానీ ఇప్పుడు అవే గుంజీలు తీస్తే ఫ్రీగా టికెట్ పొందేలా ఓ దగ్గర బంపర్ ఆఫర్ పెట్టేశారు. ప్రభుత్వమే ఇలా ఉచితంగా టికెట్ ఇవ్వడానికి గుంజీలు తీయాలని చెబుతోంది. అసలు ఎక్కడ ఈ ఆఫర్ ఉంది, ఎన్ని గుంజీలు తీయాలో తెలుసుకుందాం.

యూరప్ లోని రొమానియాలో ఈ బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. స్పోర్ట్స్ ఫెస్టివల్ పేరుతో జనాల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని వల్ల జనాలు ఫ్రీ టికెట్ కోసమైనా తమ ఆరోగ్యానికి పనికి వచ్చే గుంజీలు తీస్తారనేది అక్కడి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా భలే మిషన్ ను తయారు చేశారు. రొమినాయాలో ఫ్రీగా టికెట్లు పొందాలంటే ఓ మెషిన్ ముందు నిలబడి.. గుంజీలు తీయాల్సి ఉంటుంది. రెండు నిమిషాల్లో ఇరవై గుంజీలు తీయగలిగితే వారికి ఉచిత బస్ టికెట్ ను ఇచ్చేలా మెషిన్ ను అక్కడి అధికారులు సిద్ధం చేశారు.

అయితే ఇలా వచ్చే టికెట్ ను స్థానికులు హెల్త్ టికెట్ అని పిలుస్తుంటారు. ఆరోగ్యానికి ఉపయోగకరంగానూ, కాస్త ఎంటర్టైనింగ్ గానూ ఉండటంతో చాలామంది దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలీనా బ్జోల్కినా అనే మహిళ హెల్త్ టికెట్ ఇచ్చే వెండింగ్ మెషిన్ ముందు గుంజీలు తీసి, టికెట్ పొందిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి ఆరోగ్యాన్ని పెంచే ఐడియాలు మరిన్ని రావాలంటే చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.