కెనడా పాస్‍పోర్ట్ ఉన్న వారికి భారత ప్రభుత్వం గుడ్‍న్యూస్ చెప్పింది. వారికి ఈ-వీసా సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇక కెనడావాసులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 9 నెలల నిరీక్షణ తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడా వాసులకు ఈ-వీసాల జారీని పునఃప్రారంభించింది. ఈ విషయాన్ని కెనడాలోని ఒటావా భారత హైకమిషన్ ప్రకటించింది. వివరాలను వెల్లడించింది. అయితే తొమ్మిది నెలల క్రితం కెనడావాసులకు భారత్ ఈ-వీసాలను ఆపేసేందుకు ఓ ముఖ్యమైన కారణం ఉంది. ఇండియా వచ్చేయండి India Restores e-visa facility for Canadians: కెనడావాసులు ఇక భారత్ ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఒటావాలోని ఇండియా హైకమిషన్ వెల్లడించింది. టూరిజం, బిజినెస్, వైద్యం, సమావేశాల కోసం ఇండియాకు వెళ్లాలనుకునే కెనడా పాస్‍పోర్ట్ హోల్డర్లు ఈ-వీసాలకు అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. https://indianvisaonline.gov.in/evisa/tvoa.html లింక్ ద్వారా ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ-వీసాలను ఎందుకు నిలిపిందంటే..! ఈ ఏడాది మార్చిలో ఈ-వీసా (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్)లను 150 దేశాలకు పరిమితం చేసింది భారత్. ఆ జాబితాలో కెనడాను మినహాయించింది. కెనడా పాస్‍పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసాల జారీని నిలిపివేసింది. భారత పౌరులకు వీసాలను జారీ చేసేందుకు కెనడా చాలా జాప్యం చేసిది. కొన్నిసార్లు పది నెలల వరకు కాలయాపన చేసేది. పెద్ద సంఖ్యలో భారత పౌరుల వీసాల దరఖాస్తులను తిరస్కరించేంది. దీంతో పరస్పర చర్యగా భారత్ ఏకంగా కెనడావాసులకు ఈ-వీసాల జారీని నిలిపివేసిందని ఓ భారత సీనియర్ అధికారి చెప్పారు. కొంతకాలంగా భారత పౌరులకు వీసాల జారీని కెనడా కొంత వేగవంతం చేసింది. బ్యాక్‍లాగ్‍లను క్లియర్ చేస్తోంది. భారతీయులకు వీసాల జారీ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. దీంతో భారత్ కూడా సంతృప్తి చెందింది. ఈ ఫలితంగా, తొమ్మిది నెలల తర్వాత కెనడా పాస్‍పోర్టు హోల్డర్లకు ఈ-వీసాల ప్రక్రియను ఇప్పుడు భారత్ మళ్లీ పునరుద్ధరించింది.